పదనిసలు...

పొగ త్రాగుడు మానడం ఎలా! (పొగ తాగడం ఎలా అని నేర్పక్కర్లేదు కాబట్టి) నా స్నేహితుడు ఒకడికి సిగరెట్లు చెడతాగే అలవాటు ఉంది- చెడతాగుతాడు కాబట్టి ఏదో చెడిపోయాడని కాదు-ఊపిరి తిత్తులు చెడిపోవచ్చు అనే భయం అంతే! అందరి బాధా భరించలేక, వాడికీ మనసులో పీకుతోంది అనుకోండి “కొద్దిగా తగ్గిస్తే బాగుండును” అని-ఆమాట పైకి ఎవరితో అనలేదనుకొండి-నాతో తప్ప. ఎలాగైతేనేం ఓ శుభముహూర్తాన వశీకరణనిపుడిని-“వైద్యుడు” అని అనలేంగదా (హిప్నాటిస్ట్) దగ్గరకు వెళ్లడం జరిగింది.వాడొక్కడేకాదు, నేను కూడా తోడుగా వెళ్ళాననుకోండి- వాడికి తోడుకోసమే కాదు- వశీకరణ నిపునుణ్ణి చూడాలనీ, అసలు ఎలా జబ్బు నయం చేస్తాడో అనే కుతూహలం కూడాను.

ఇద్దరినీ కూర్చోబెట్టి కొన్నివిషయాలు,విడివిడిగా మా ఇద్దరినీ కొన్ని విషయాలు అడిగాడు. స్థూలంగా ఈ కింది విధంగా సాగాయి ఆయన ప్రశ్నల పరంపర...

ఈ అలవాటు ఎప్పటినుంచి, రోజుకి ఎన్ని సిగరెట్లు,ఎన్ని ప్యాకెట్లు! ఒక్కడే ఉన్నప్పుడు ఎక్కువ తాగుతాడా, స్నేహితులతో ఉన్నప్పుడు ఎక్కువ తాగుతాడా! స్నేహితుల్లో వీడికంటే ఎక్కువ తాగేవాళ్ళు ఉన్నారా, లేక వీడే ఎక్కువ తాగుతాడా! సొంత డబ్బులతో కొనుక్కుంటాడా, లేదా ఉచితంగా వస్తాయని తాగుతాడా!

స్నేహితుల సిగరెట్లకు కూడా డబ్బులు ఇస్తాడా,లేదా ఎవరి డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటారా! ఎవరైనా ఆడస్నేహితురాలు ఉందా,ఉంటే ఆ అమ్మాయి ముందు కూడా తాగుతాడా! ఆ అమ్మాయికి కూడా అలవాటు ఉందా,ఆ అమ్మాయి స్నేహితుల్లో ఎవరికైనా ఈ అలవాటు ఉందా! కాఫీ ముచ్చట్లు చేసేటప్పుడు సిగరెట్టు తాగుతాడా! మీవాడికి మందు అలవాటు ఉందా- ఆ అమ్మాయికి తెలుసా-రహస్యంగా ఉంచాడా!

తెలిసినా అభ్యంతర పెట్టదా,ఆ అమ్మాయికి కూడా అలవాటు ఉందా! మీ వాడి ఇంట్లో తెలుసా మీవాడు ఇంత పీకుడుగాడని!

మూడు సంవత్సరాల డిగ్రీ సమయంలో గానీ, ఉద్యోగవేటలో ఇంటర్ వ్యూ ల్లోగానీ ఇన్ని ప్రశ్నలు ఎదుర్కోలేదు ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు- మావాడి జీవితచరిత్ర రాసేంత సామగ్రి, విషయాలు రాబట్టాడు నాదగ్గర నుంచి;నాకో అనుమానం వచ్చింది వీడు ఏమైనా గూగుల్ కి గానీ పేస్ బుక్ కి గానీ ఏజెంట్ ఏమో అని. ఓరి నాయనోయ్-యక్షుడు కూడా ధర్మరాజుని ఇన్ని ప్రశ్నలు వేసి ఉండడు-వేసి ఉంటేనా-అంతటి ధర్మరాజు కూడా ఆ యక్షుడి బుర్ర రామకీర్తన పాడించి ఉండేవాడు.ఆ ప్రశ్నలన్నీ నేనిప్పుడు రాసానంటే నా అడ్రెస్ కనుక్కొని మరీ వచ్చి కొట్టిపోతారు-అంత రిస్క్ చేయలేను. చెప్పొద్దూ నాకు మాత్రం ఈ నిపుణుణ్ణి ఓ పీకు పీకుదామన్నంత కోపం వచ్చింది; కానీ అంతలోనే తమాయించుకున్నా; నేను పీకుతే- మా వాడి సిగరెట్ల పీకుడు మానటానికి నివారణోపాయం-మార్గం మూసుకుపోతుందిగా-ఆ దెబ్బతో మా వాడు ఓ నాలుగు పీకులు నన్ను పీకొచ్చు-అంచేత అన్నమాట! వెధవ పితలాటకం వాడి ఆప్తస్నేహితుణ్ని అవటం మూలాన!

ఇలా ఓ రెండు దఫాలు ఇరుపక్షాలకు సమావేశాలు నడిచాయి ఓ పక్షం రోజుల్లో - నేను మావాడికి తోడుగా మాత్రమే “అనుసరించేవాణ్ణి”-అలా అంటే ఏదో వాడికి తెలియకుండా అని కాదు- వాడితోపాటుగా వెళ్ళేవాణ్ణి అని అర్ధం.మన తెలుగులో ఉన్న నానార్ధాల వల్ల వెధవ అపార్ధాలకు పోవచ్చు కొందరు- ఆ నిపుణుడూ మా వాడూ ఆంతరిక చర్చలు నడిపేవారు- నా నిమిత్తం లేకుండా!

ఏమి ప్రభావమోగానీ మావాడు పీకుడు దూకుడు కొద్దిగా తగ్గించాడు అనే చెప్పవచ్చు-ఇలా రెండునెలలు వాళ్ళీద్దిరా మధ్య సెషన్స్ నడిచాయి.ఈ- కామర్స్- ఈ - టైలింగ్ ఈ-మెయిల్-ఈ బుక్ -అంతా “ఈ” లేగా ఈ రోజుల్లో- ఆ సిగరెట్టు నుంచి ఈ- సిగరెట్టుకి బదిలీ అయిపోయాడు మావాడు.

క్రమేపీ మా వాడికి సిగరెట్టు తాగి అలవాటు దాదాపుగా పోయినట్టే అయింది, కాకపోతే ఓ కొత్త అలవాటు అంటుకుంది.ఎలక్ట్రానిక్ సిగరెట్లు గుప్పు గుప్పున పీలుస్తున్నాడు-కాల్చడం బదులుగా-ఈ పీల్చే వాసనలుకూడా రకరకాలుగా దొరుకుతాయి.

ఇందులో ఉండేదీ నికోటినే- చూడటానికి పెన్ లాగానో, యు.ఎస్.బి డ్రైవ్ లాగానో, ఉండేది.నికోటిన్ కాల్చి పీల్చేవాడు కాస్తా- నికోటిన్ ని తిన్నగా పీలుస్తున్నాడు ఇప్పుడు. మావాడిలో “ఈ” మార్పు రావడం కోసం ఆ నిపుణుడికి చాలా వేలే తగలేశాడు మావాడు-రెంటి చేతివేళ్ళకంటే ఎక్కువే “స్మోకింగ్” లోంచి “వేపింగ్” లోకి వచ్చాడన్నమాట;తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది- ఈ-సిగరెట్టు ఆ సిగరెట్టు కంటే- మాహాప్రమాదకారి అని.

రెండునెలల్లో మావాడూ నేనూ ఆ నిపుణుడి దగ్గరకు వెళ్లాల్సి రావచ్చు“ఈ” సిగరెట్టు ఎలా మానేయాలో తెల్సుకుంటే మళ్ళీ “ఆ” సిగరెట్టుకి మావాడు చేరుకుంటాడు! ఇప్పుడు “ఈ” సిగరెట్టు వ్యసనాన్ని వదిలి ఆ సిగరెట్టు తాగడం ఎలా అలవాటు చేసుకోవాలో ఆ వశీకరణ వాడి దగ్గర మావాడు వెళ్లి నేర్చుకోవాలి- లేకపోతే ఈ వ్యసనం నుంచి వాడు బయటపడేది ఎలా! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఆ కబురుకోసం మావాడి నోటినుంచి!

ఈ అనుభవం మూలంగా ఈ సందర్భంగా అందరికీ ఓ చిన్న ఉచిత సలహా – పారేస్తున్నా (సలహా ఉచితం అయితేనే ఎవరూ తీసుకోవడం లేదు, డబ్బులిచ్చి ఎవరు కొంటాడు మన దగ్గర నుంచి) పట్టించుకోకపోయినా పర్వాలేదనుకోండి- అయినా సరే ఎప్పటిలాగా చెప్పడం మాత్రం మానను - మీ వెధవ అలవాట్లు మీరు మానినా మానకపోయినా-నా స్నేహితుడికి మల్లే!

అలవాట్లు- వెధవ అలవాట్లు-దురలవాట్లు అంటే అందరికీ తెలుసు-అవి అర్ధం చేసుకుని వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది-లేదంటే ఇదిగో ఇలా మా వాడిలా మీరూ అయిపోతారు.అప్పటికి మీకేదో తెలియదు అని కాదు- నా చేతిదురద కాబట్టి ఇంత రాసా! ఇంక ఉంటా- బోల్డు పనులున్నాయి- బయట చక్కపెట్టేవి...

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!